..

Thursday, 6 October 2016

యుగములు-వేదములు-ఉపనిషత్తులు- పురాణములు


కాలము, యుగము రూపములో తిరుగుచున్నది. కావున పరమేశ్వరుడు, ప్రతియుగములోనూ సకలజీవములకు, రక్షణ కల్పించుటకు మానవ మనుగడ, సనాతన ధర్మమార్గములో నడిపించడానికి, మానవ జీవోద్దరణకు, మనకొరకు పరమాత్మ, వేదములను ప్రసాదించాడు.
నాలుగు యుగములలో అనగా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము ఈ మూడు యుగములలో,భగవంతుడు కరచరణాదులతో మానవులతో, కలసి మెలసి జీవించి, మానవ జాతిని ఉద్ధరించాడు. కానీ కలియుగములో,పరమాత్మ కరచరణాదులతో కనిపించడు. కాబట్టి పరమాత్మ మనకు, వేదములను ప్రసాదించాడు. వేదములే మనకు ప్రమాణము. అంతకు మించిన ప్రమాణము లేదు.

ఈ వేదములు నాలుగు కానీ మహాభారతము పంచమ వేదముగా పిలువబడి, వేదములు ఐదుగా విరాజిల్లుచున్నవి. వేదముల నుండి, వేదాంగములు అందుండి ఉపనిషత్తులు, వేదాంతమునకు, భక్తికి, వేదములు ప్రారంభస్థానమైతే, వేదాంతమునకు వేదసారములకు ఉపనిషత్తులు చివరి భాగము.
ఉపనిషత్తులు 108. ఈ ఉపనిషత్తులు ఐదు వేదముల నుండి వచ్చాయి.
ఋగ్వేదము నుండి 10 ఉపనిషత్తులు
శుక్ల యజుర్వేదము నుండి 19 ఉపనిషత్తులు
కృష్ణ యజుర్వేదము నుండి 32 ఉపనిషత్తులు
సామవేదము నుండి 16 ఉపనిషత్తులు
అధర్వణ వేదము నుండి 31 ఉపనిషత్తులు
మొత్తం 108 . . . .
ఈ 108 ఉపనిషత్తులలో ప్రధానమైనవి 12 ఉపనిషత్తులు.
1)ఈశోపనిషత్తు 2) కేనోపనిషత్తు 3) కఠోపనిషత్తు 4) తైతిరీయోపనిషత్తు 5) ఐతరేయోపనిషత్తు 6) ప్రశ్నోపనిషత్తు 7) ముండకోపనిషత్తు 8) మాండుక్యోపనిషత్తు 9) ఛాందోగ్యోపనిషత్తు 10) శ్వేతశ్వతరోపనిషత్తు 11)బృహదారణ్యకోపనిషత్తు 12) మహానారాయణకోపనిషత్తు
ఎనిమిది ఉపప్రధానమైన ఉపనిషత్తులు .
1) కైవల్యకోపనిషత్తు 2) కౌషితకోపనిషత్తు 3) ఆత్మోపనిషత్తు 4) అమృతబిందోపనిషత్తు 5) బ్రహ్మోపనిషత్తు 6) పరమహంసొపనిషత్తు 7) సర్వోపనిషత్తు 8) అరుణేయోపనిషత్తు
ఈ ఉపనిషత్తుల నుండి అష్టాదశ పురాణములు వచ్చాయి. అవీ మన సౌకర్యము కొరకే.
అష్టాదశపురాణములు మూడు భాగములుగా ఉండి ఒక్కో భాగములలో ఆరు పురాణములు.
బ్రహ్మపురాణములు, బ్రహ్మతత్వమును గురించి
విష్ణుపురాణములు, విష్ణుతత్వము గురించి
శివపురాణములు, శివతత్వమును గురించి వివరిస్తూ ఉన్నాయి.
🌿విష్ణుసంబంధపురాణములు-6
1.భాగవత పురాణము:- 18 వేల శ్లోకముల సముదాయము.
2.విష్ణుపురాణము:- 23 వేల శ్లోకములతో విష్ణు భక్తుల గురించి, వర్ణాశ్రమధర్మములను,వేదముల యొక్క ఆరు అంగములను, కలిపురుషుని లక్షణాలను, శ్వేతా వరాహ కల్పముల విషయములను తెలియచేయుచున్నది.
3.నారదీయపురాణము:- 25 వేల శ్లోకములతో వేదాంత ముఖ్యమైన విషయములను, వేదాంత సారములను, పూరీజగన్నాథుడు,ద్వారకానాథుడు, బదరీనాథుల గురించి తెలియచేయుచున్నది.
4.పద్మపురాణము:- 55 వేల శ్లోకములతో భాగవత, రామాయణ, జగన్నాథ, మత్య్సావతార, భృగు మొదలగు విషయముల గురించి తెలియజేయుచున్నది.
5. గరుడపురాణము:- 19 వేల శ్లోకములతో భగవద్గీత, జనన మరణ, విష్ణు సహస్రనామముల గురించి తెలియజేయుచున్నది.
6.వరాహపురాణము:- 24 వేల శ్లోకములతో కూడిన వ్రతరాజముల గురించి విష్ణు మహిమల గురించి తెలియజేయు చున్నది.
🌿II.బ్రహ్మసంబంధపురాణములు-6
1.బ్రహ్మానందపురాణము:- 12 వేల శ్లోకములతో వేదముల గురించి ఆదికల్పమును గురించి తెలియజేయుచున్నది.
2.బ్రహ్మవైవర్తపురాణము:- 18 వేల శ్లోకములతో రాధా కృష్ణుల గురించి తెలియజేయుచున్నది.
3.మార్కండేయ పురాణము:- 9 వేల శ్లోకములతో రామ కృష్ణుల లీలలను గురించి తెలియజేయుచున్నది.
4.భవిష్యపురాణము:- 14500 శ్లోకములతో కృష్ణ భగవానుని మరియు చైతన్య ప్రభువును గురించి తెలియజేయు చున్నది.
5.వామనపురాణము:- 10 వేల శ్లోకములతో త్రివిక్రమ స్వామిని గురించి తెలియజేయుచున్నది.
6.బ్రహ్మపురాణము:- 10 వేల శ్లోకములతో దక్ష ప్రజాపతికి, బ్రహ్మదేవుడు వివరించిన, విషయములను గురించి తెలియజేయుచున్నది.
🌿III.శివసంబంధపురాణములు:-6
1.మత్స్యపురాణము:- 14 వేల శ్లోకములతో దేవాలయ నిర్మాణములు, అందు పాటించవలసిన నియమములు, వామనావతారము వరాహ కల్పమును గురించి తెలియజేయుచున్నది.
2.కూర్మపురాణము:- 17 వేల శ్లోకములతో లక్ష్మీ కల్పము, ధన్వంతరి, కృష్ణ సూర్య, సంవాదముల గురించి తెలియజేయుచున్నది.
3.లింగ పురాణము:- 10 వేల శ్లోకములతో గాయత్రి మాత నృసింహ,జగన్నాథ్, అంబరీషుల గురించి తెలియజేయు చున్నది.
4.శివపురాణము:- 24 వేల శ్లోకములతో ఆరు సంహితలతో రోమర్పుల గురించి తెలియజేయుచున్నది.
5.స్కందపురాణము:- 81 వేల శ్లోకములతో తారకాసురవధ, సుబ్రహ్మణ్యస్వామి గురించి తెలియజేయుచున్నది.
6.అగ్నిపురాణము:- 15400 శ్లోకములతో సాలగ్రామములను గురించి వివరముగ తెలియజేయుచున్నది.
మానవ జీవితమును ధర్మమార్గములో నడిపించేవి, నడిపించేందుకు ఆదర్శప్రాయ మైన, ప్రమాణికమైన, గ్రంధరాజములుఇతిహాసములు. .
🌿ఇతి-హా-అసం
1.శ్రీ రామాయణము 2.మహాభారతము
🌿మన ముఖ్య ఇతర గ్రంథములు:-
1) మనుస్మృతి 2) అర్థశాస్త్రము 3) ఆగమశాస్త్రము 4) తంత్రశాస్త్రము
5) స్తోత్రములు 6) ధర్మశాస్త్రము 7) దివ్యప్రబంధము
8) తివరము 9) రామచరిత మానస 10) యోగ వాశిష్టము
భక్తి నవవిధములు:-
🌿శ్రీ నారద మహర్షులవారు సెలవిచ్చినవి నవవిధ భక్తి మార్గములు.
1.శ్రవణం 2. కీర్తనం 3. స్మరణం 4. పాద సేవనం 5. అర్చనం 6.వందనం 7 దాస్యం 8. సఖ్యం 9. ఆత్మ నివేదనం. . .
ఇందులో ఒక్కొక్క భక్తి వలన కొంతమంది భక్తులు తరించారు, ముక్తిని పొందారు. ఏ ఏ భక్తి వలన ఎవరు ఎలా తరించి ముక్తిని పొందేరో .........చూడండి
1 శ్రవణం .......... :- వలన పరీక్షిత్ మహారాజు
2 కీర్తనం ......... :- వలన శ్రీ శుకుడు, శ్రీ త్యాగరాజ స్వామి, శ్రీ మదాసు, శ్రీ అన్నమయ్య, శ్రీ తులసీ దాస్
3 స్మరణం ........ :- వలన ప్రహ్లాదుడు
4 పాదసేవనం ....:- వలన లక్ష్మీదేవి
5 అర్చనం ........ :- వలన పృధు మహారాజు
6 వందనం ........ :- వలన అక్రూరుడు, గరుత్మంతుడు
7 దాస్యం ......... :- వలన హనుమంతుడు
8 సఖ్యం .......... :- వలన అర్జునుడు, ఉద్దవుడు,గోపాల బాలురు
9 ఆత్మనివేదనం :- వలన బలి చక్రవర్తి
శ్రీ నారదులవారు చెప్పిన నవవిధ భక్తిమార్గములే కాక
1 మూఢ భక్తి ... :- వలన తిన్నడు
2 కామభక్తి ..... :- వలన గోపికలు
3 భయ భక్తి .... :- వలన కంసుడు
4 వైర భక్తి ....... :- వలన శిశుపాలుడు
5 సంబంధ భక్తి.. :- వలన విష్ణు వంశమువారు, గోపాలురు
6 ద్వేష భక్తి ...... :- వలన హిరణ్యకశిపుడు, జరాసంధుడు
7 ప్రేమ భక్తి........ :- వలన పాండవులు
8 భక్తితో భక్తి..... ..:- వలన నారదుడు
9 వాలిన భక్తి .... :- వలన పోతనామాత్యులు
వీరందరూ భక్తి మార్గములలో సేవించి తరించినవారే.
🌿నమస్కారములు:
నమస్కారములు చాలా విధములు అందులో
🙏సాష్టాంగ నమస్కారము:-
ఏడు శరీరాంగములు + మనసు కలిపి ఎనిమిది అంగములు. ఈ ఎనిమిది అంగములు భూమికి తగిలేలా బోర్లాపడి నమస్కరించడమే సాష్టాంగ నమస్కారము.
“ఉరసా, శిరసా, దృష్ట్యా, మనసా, వచసా తధా,
పద్భ్యాం కరాభ్యామ్, కర్ణాభ్యామ్, ప్రణామోస్థాంగముచ్యతే”
1కాళ్ళు 2 చేతులు 3 ముక్కు 4 చెవులు 5 ఉదరము 6 కళ్ళు 7 నోరు 8 మనస్సు
ముఖ్యగమనిక:- స్త్రీలు మాత్రము ఈ సాష్టాంగ నమస్కారము చేయరాదు అని వేదములు నొక్కి వక్కాణిస్తున్నాయి. స్త్రీలు కేవలం పంచాంగ నమస్కారము మాత్రమే చేయాలి.
🙏పంచాంగ నమస్కారము :-
పంచాంగములు 1 అరిచేతులు 2 మోకాళ్లు 3 మోచేతులు 4 పాదములు 5 శిరస్సు.
🙏అభివాద నమస్కారము:-
ప్రవరతోటి చేయు నమస్కారము. అభివాద నమస్కారము నిలబడి చేయరాదు. పూర్తిగా వంగి పాదముల మీద చేతులు ఉంచి మెల్లగా లేచి నమస్కారము చేయాలి. గురువుగార్లలను, ఆచార్యదేవులను,
వేదపండితులను,నిత్యాగ్నిహోత్రులను, వయోవృద్దులను, జ్ఞానవృద్దులను దర్శించినపుడు లేదా వారి దగ్గరకు వెళ్ళినపుడు విధిగా అభివాద నమస్కారము చేయాలి.
🙏ప్రణిపాతము:- ఆర్తితో చేయు నమస్కారము. నేలమీదపడి నమస్కారము చేయడము.
“మహృదయ క్షేత్రాలలో భక్తి, అనే బీజాలను నాటండి. దీనిని మనస్సుఅనే నీటితో తడపండి. దానికి నాలుగు దిక్కుల సంత్సంగం అనే కంచె వేయండి. దానివలన కామాది, వికృతరూప, పశువులు రాకుండా ఉంటాయి. మీరీ విధంగా వ్యవహరిస్తే ఆ బీజాలు చిగురించి పంట పండి తర్వాతి కాలంలో శాంతి ఆనందం అనే పంట ఫలాలు మన చేతికి వస్తుంది.”
🌿ఉపనిషత్తులు అంటే ఏమిటి?
వేదములు-అపౌరుషేయాలు. అంటే తపస్సు చేయుచున్న ఋషులకు, పరమాత్మ ద్వారా కేవలం, ఉదాత్త, అనుదాత్త స్వరములతో మాత్రమే వినిపించేవి. వీటికి లిపి లేదు. ఆ వేదములు ఋషుల ద్వారా మానవాళికి, ఆధ్యాత్మిక ధర్మ సంప్రదాయము లకు ముఖ్య సూత్రములు. సనాత ధర్మమునకు జీవనాడులు. ఈ వేద వేదాంగముల సారమే ఉపనిషత్తులు.
ఉప-ని-షత్ అంటే గురువు వద్ద కూర్చొని నేర్చుకోనేది. వీటినే శృతులు అని అంటారు. ఈ ఉపనిషత్తులు 250 పైనే ఉన్నాయి. కానీ వాటిలో 108 మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ 108 లో కూడా ప్రామాణికమైనవి, ప్రాచీనమైనవి 14 మాత్రమే. ఈ 14 ఉపనిషత్తులకు పరమేశ్వరుడు, భూలోకానికి దిగి వచ్చి మన కొరకు ఆచార్యుల రూపాలలో పూజ్యపాద శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యులు, పూజ్యపాద శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్యులు, పూజ్యపాద శ్రీ శ్రీ శ్రీ మధ్వాచార్యులు, పూజ్యపాద శ్రీ శ్రీ శ్రీ రమణ మహర్షులు, పూజ్యపాద శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర భారతీ సరస్వతీ స్వామి వారు ఇలా ఎందరో మహానుభా వులు వేదములకు, వేద-వేదాంగములకు, ఉపనిషత్తులకు భాష్యం చెప్పారు.
🌿14 ఉపనిషత్తులు.
1. ఋగ్వేదము :– ఐతరేయ ఉపనిషత్తు, కౌషీతకోపనిషత్తు
2. కృష్ణయజుర్వేదము:- తైత్తరీయోపనిషత్తు, కఠఉపనిషత్తు, మైత్రాయనీయోపనిషత్తు, శ్వేతాశ్వరోపనిషత్తు
3. శుక్లయజుర్వేదము:- ఈశావాశ్యకోపనిషత్తు , బృహదారణ్యకోపనిషత్తు
4. సామవేదము:- ఛాదోగ్య ఉపనిషత్తు, కెనోపనిషత్తు
5. అధర్వణవేదము:- ప్రశ్నోపనిషత్తు, మాండుక్యోపనిషత్తు, ముండకోపనిషత్తు, కైవల్యోపనిషత్తు
ఈ ఉపనిషత్తులలో లేనివి ఈ ప్రపంచంలో లేదు. అన్నీ ప్రశ్నలకు, సమాధానాలకు ఈ వేదాలు ఉపనిషత్తు లు మరియు ఆచార్యులు భాష్యములే ఆధారము. మనిషి తల్లి గర్భ ప్రవేశము నుండి, మరు భూమికి చేరి మరలా జీవుని పరిస్థితిని, కాలగతిని, అన్నీ ఇందులో నిక్షేపింపబడినాయి.
మనకు(దేహానికి) అనారోగ్యము చేసినప్పుడు, డాక్టరుగారి దగ్గరకు వెళ్ళి డాక్టరుచే సూదులు వేయించుకొని డాక్టరుగారు ఇచ్చిన మందులు వాడుతాము కదా? మరి మన జీవికి (ఆత్మకు) వచ్చిన అనారోగ్యము(అంటే అరిషడ్వర్గములు బాధించే బాధలు జరా-మరణ బాధలు) మాటేమిటి? ఈ అనారోగ్యమునకు పూజ, జపము, ధ్యానములే మందులు. ఈ మందుల మోతాదును ఉపయోగించే విధానమును మనకు తెలియచేయు వైద్యుడే గురువు. ఈ విధముగా గురు ఆజ్ఞ మేరకు మనము ఆ మందులను వాడి, ఆ మందులు మన శరీరంలోని అణువు అణువు నిండి నిమిడీకృత మైతే, ఇక మనలో యున్న ఆత్మకు అనారోగ్యము లేదు.
మన శరీరంలో 72 వేల నాడుల ఉంటాయి. అందులో 14 నాడులు ముఖ్యమైనవి. 1) పింగళ, 2) ఇడ 3) సుఘమ్న 4) సరస్వతి 5) పూష 6) వరుణ 7) సప్తజిహ్వ 8)యశస్విని 9) అలంబస 10) కుహు 11) విశ్వోధార 12) పయస్విని 13) గాంధార 14) శుంభి. ప్రధాన నాడులు. ఇడ,పింగళ, సుఘమ్న. వీటి మూడింటికి త్రిమూర్తులు అధినాయకులు. సుఘమ్న నాడికి కుడిప్రక్క సూర్యనాడి, ఎడమ ప్రక్క చంద్ర నాడి ఉంటాయి. ఈ సూర్య చంద్ర నాడులు కలుపు ప్రదేశమే భ్రూమధ్యము.
ఆజ్ఞాచక్రము:-
సూర్య చంద్ర నాడులు అంతర్ముఖముగా ప్రయాణించి పాలభాగము మీద అర్థ చంద్రాకృతిలో ఉంటాయి. అపుడు రెండు కనుబొమల మధ్య ఉన్న భ్రూకుటికి ఆజ్ఞా చక్రమని పేరు. ఈ ఆజ్ఞాచక్రము నిలబడి తెరుచుకుంటే దివ్యజ్ఞానము ప్రభాసిస్తుంది. దివ్యదృష్టి కలుగుతుంది.
శ్లో || నాస్తిలోభసమో వ్యాధిః | నాస్తి క్రోధసమోరివుః
నాస్థిదారిద్ర్యవత్ దుఃఖం | నాస్తి జ్ఞానాత్ పరం సుఖమ్ ||
లోభాన్ని మించిన వ్యాధి లేదు, క్రోధాన్ని మించిన శత్రువులు లేరు, దారిద్యాన్ని మించిన దుఃఖం లేదు, జ్ఞానాన్ని,తృప్తిని మించిన సుఖం లేదు.
పంచీకరణము పంచభూతపంచీకరణము
1.ఆకాశము 2. వాయువు 3.అగ్ని 4. జలము 5. భూమి
1.ఆకాశము :- ప్రధానముగా తీసుకొని ½ భాగము ఆకాశము, 1/8భాగము వాయువు,1/8 భాగము అగ్ని, 1/8భాగము నీరు, 1/8 భాగము భూమి.
2.వాయువు :- ప్రధానముగా తీసుకొనినా ½ భాగము వాయువు, 1/8 భాగము ఆకాశము,1/8 భాగము అగ్ని, 1/8 భాగము నీరు,1/8 భాగము భూమి.
3.అగ్ని:- ప్రధానముగా తీసుకొన్న భాగము అగ్ని, 1/8 భాగము ఆకాశము, 1/8 భాగము వాయువు, 1/8 భాగము నీరు,1/8 భాగము భూమి.
4.జలమును:- ప్రధానముగా తీసుకొనిన 1/2 భాగము జలము, 1/8 భాగము ఆకాశము,1/8 భాగము వాయువు,1/8 భాగము అగ్ని, 1/8 భాగము భూమి.
5. భూమిని:- ప్రధానముగా తీసుకొనిన ½ భాగము భూమి, 1/8 భాగము ఆకాశము, 1/8 భాగము వాయువు, 1/8 భాగము అగ్ని, 1/8 భాగము జలము.
పై విధముగా పంచభూత పంచీకరము జరిపిన ఆభావములు తెలియవచ్చును.
కావున
1) ఆకాశమునకు శబ్దగుణము కలదు
2) వాయువుకు శబ్ద, స్పర్శ రెండు గుణములు
3) అగ్ని శబ్ద,స్పర్శ, రూప గుణములను కలిగి ఉంది.
4) జలమునకు శబ్ద, స్పర్శ, రూప, రస రూపములుంటాయి.
5) భూమికి శబ్ద,స్పర్శ, రూప, రస, గంథములనబడే ఐదు గుణములుంటాయి.
కావున పంచభూతములు ఈ సృష్టిలో,సృష్టిచే శక్తిని పొంది ఉన్నాయి. కావున ఈ సృష్టి అంతా పంచ భూతాత్మకము.ఈ పంచ భూతములను ఆధారముగా తీసుకొని ఇరవై అయిదు తత్వములు ఏర్పడ్డాయి వీనినే పంచ వింశతి తత్వము అంటారు. ఎలాగంటే పంచభూత పంచీకరణము ఆధారంగానే పంచ వింశతి తత్వములు వస్తాయి. పరబ్రహ్మము నుండి ఏర్పడిన ఈ పంచభూత పంచ వింశతిని జాగ్రత్తగా గమనిస్తే మనిషి మనుగడ మానవుని నడవడి అర్థమవుతుంది.
1. ఆకాశము ప్రదానమై రెండు భాగములు చేసిన అందు ½ భాగము ఆకాశధార పరబ్రహ్మము.
మిగిలిన అర్థభాగములో 1/8 వాయువు ఆధారంగా మనసు
మిగిలిన అర్థభాగములో 1/8 అగ్ని ఆధారంగా బుద్ది
మిగిలిన అర్థభాగములో 1/8 జలము ఆధారంగా చిత్తము
మిగిలిన అర్థభాగములో 1/8 భూమి ఆధారంగా అహంకారము
2. వాయువు ప్రధానమై రెండు భాగములు చేసిన అందు ½ భాగము ధారంగా ఉదాన వాయువు
మిగిలిన అర్థభాగములో 1/8 ఆకాశము ఆధారంగా సమానము
మిగిలిన అర్థభాగములో 1/8 అగ్ని ఆధారంగా వ్యానము
మిగిలిన అర్థభాగములో 1/8 జలము ఆధారంగా అపానము
మిగిలిన అర్థభాగములో 1/8 భూమి ఆధారంగా ప్రాణము
3. అగ్ని ప్రధానమైన రెండు భాగములు చేసిన అందు ½ భాగము అగ్ని చక్షువు
మిగిలిన అర్థభాగములో 1/8 ఆకాశము ఆధారంగా శ్రోత్రము
మిగిలిన అర్థభాగములో 1/8 వాయువు ఆధారంగా త్వక్కు
మిగిలిన అర్థభాగములో 1/8 జలము ఆధారంగా జిహ్వ
మిగిలిన అర్థభాగములో 1/8 భూమి ఆధారంగా ఘ్రాణము
4. జలము ప్రధానమై రెండు భాగములు చేసిన అందు ½ భాగము జలరసము
మిగిలిన అర్థభాగములో 1/8 ఆకాశము ఆధారంగా శబ్దము
మిగిలిన అర్థభాగములో 1/8 వాయువు ఆధారంగా స్పర్శ
మిగిలిన అర్థభాగములో 1/8 అగ్ని ఆధారంగా రూపము
మిగిలిన అర్థభాగములో 1/8 భూమి ఆధారంగా గంథము.
5. భూమి ప్రధానమై రెండు భాగములు చేసిన అందు ½ భాగము భూమి గుదము.
మిగిలిన అర్థభాగములో 1/8 ఆకాశము ఆధారంగా వాక్కు
మిగిలిన అర్థభాగములో 1/8 వాయువు ఆధారంగా పాణి
మిగిలిన అర్థభాగములో 1/8 అగ్ని ఆధారంగా పాదము
మిగిలిన అర్థభాగములో 1/8 జలము ఆధారంగా గుహ్యము
ఇలా స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణ శరీరములగుచున్నవి. స్థూల సూక్ష కారణ శరీరముల పైన పరమాత్మ ఉండును.
Share:

0 comments:

Post a Comment

Copyright © .. | Powered by Blogger
Design by SimpleWpThemes | Blogger Theme by NewBloggerThemes.com